Petition updateCondemn the undemocratic attitude of TelanganaGovt on the dismissal of 50000 RTC employeesకలిసి కలబడదాం.. ఆర్టీసీ కార్మికుల డిమాండ్లు పరిష్కారం అయ్యేదాక కొట్లాడుదాం
Telangana Netizensredmond, WA, United States
Oct 14, 2019

మిత్రులరా..!


గత కొద్ది రోజుల సంది మన తెలంగాణ ఆర్టీసీ కార్మికులు తమ డిమాండ్లను పరిష్కరించాలని సమ్మె చేస్తున్నరు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మాత్రం సమ్మెలు.. గిమ్మెలు జాంతానై అంటూ హుకుం జారీ చేసిండ్రు. ‘ ఉద్యమాలు అంటు ఎక్కువ మాట్లాడుతుండ్రు... 50 వేల మంది ఉద్యోగాలు హూస్ట్ చేస్తాను’ అంటూ టెక్నికల్ లాంగ్వేజీలో మాట్లాడుతున్నరు. రాజ్యాంగంలోని లేని కొత్త జార్గాన్ కనిపెట్టి కార్మికులు సెల్ఫ్ డిస్మిస్ అయ్యారంటూ రాజ్యాంగాన్నే అవమాన పరుస్తున్నరు.


రెచ్చగొట్టే మాటలతో ఇప్పటికే రెండు ప్రాణాలు తీసుకుండ్రు. తానా తందానా బ్యాచ్‌తో కార్మికులను సావులవైపు ఉసిగొల్పుతుండ్రు. తెలంగాణలో పౌరసమాజం రెండుగా విడిపోయినది. కేసీఆర్ నిర్ణయాలను సమర్థించేవారు.. వ్యతిరేకించే వాళ్లుగా సీన్ క్రియేట్ అయింది. అంతా రాజకీయ డ్రామా అంటోంది కేసీఆర్ టీం.. కాదు మావి పొట్టతిప్పలు అంటున్నరు శ్రామికులు. ఇంకోపక్క.. కార్మికులు కేసీఆర్‌ను అడుక్కునే తీరు ఇది కాదంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నది భజన బ్యాచ్. ‘35 రోజుల ముందే సమ్మె నోటీసు ఇచ్చినం. కల్వాల్సినోళ్లందర్నీ కల్సినం. దిక్కులేకనే సమ్మెకు దిగినం’ అంటున్నది కార్మికలోకం.


‘పండగ పూట సమ్మె చేస్తరా? ప్రజలను ఇబ్బందులు పెడతరా? ఇది బ్లాక్ మేయింలింగ్ కాదా?’ అంటూ వాస్తవాల జోలికి పోకుండా.. ప్రజలను తమ వైపు తిప్పుకునేందుకు కేసీఆర్ టీం ప్లాన్ రచించి బాగానే అమలు చేసింది. కానీ కార్మికుల ఆర్తి తెల్సిన తెలంగాణ సమాజం వాళ్లను గుండెల్లో పెట్టుకుంది. కేసీఆర్ ఎత్తులను, జిత్తులను తిప్పికొట్టింది. ఇప్పుడు మరో ప్లాన్‌తో కేసీఆర్ టీం ముందుకు వస్తోంది. విలీనం తప్పా.. మిగతా విషయాలు పరిష్కరిస్తామంటూ రాయబారిని తయారు చేసిండ్రు. ఇందుకోసం రాజ్యసభ సభ్యుడు కేశవరావును ఎంచుకుండ్రు. చర్చిద్దామంటూ కార్మికులకు జాబు పంపిడ్రు. చర్చలు జరగాలే.. ఇది అందరి కోర్కే.. కానీ షర్తులతో కూడిన చర్చలు ఏంటిది? అనేదే ఇప్పుడు అందరి ప్రశ్న.


రెచ్చగొట్టే మాటలు ఆపండి :


అధికార పార్టీ నాయకులు ఆర్టీసీ కార్మికులను రెచ్చగొడుతున్నరు. కేసీఆర్ తీర్పు ఫైనల్ అంటూ భయాందోళనకు గురి చేస్తున్నరు. కార్మికులు కాదు.. ఉద్యోగులు అంటూ సాంకేతిక నిర్వచనాలు ఇస్తున్నరు. సమ్మె చేసే హక్కు లేదంటూ రాజ్యాంగానికి, ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా కేసీఆర్ చేసిన ప్రకటనను పెద్దగా చేసి చూపిస్తున్నరు. దీంతో భయాందోళనకు గురైన కార్మికులు చావుతప్ప ఇంకో మార్గం లేదనే భావనలోకి పోతున్నరు. ఇప్పటికైనా మంత్రులు, నాయకులు తమ పద్ధతి మార్చుకోవాలె.. హద్దుల్లో ఉండాలె. కార్మికులు, ఉద్యోగుల, సకల జనులు సమ్మెలు, హర్తాళ్లు, ఆందోళనలు చేయకుండానే తెలంగాణ వచ్చిందా? కేసీఆర్ డైరెక్షన్‌లోనే కదా ఇవన్నీ జరిగినయి. ఓడ మల్లన్న, బోడి మల్లన్న.. సామెతను నిజం చేయకండ్రి..


తెలంగాణ సమాజం మొత్తం ఆర్టీసీ కార్మికుల వెంట ఉన్నది. వారి పిలుపును అమలు చేయడానికి ఇక్కడి సకల జనులు శపథం తీసుకున్నరు. కేసీఆర్ పంతం వీడకపోతే ఆర్టీసీ కార్మికులతో నడవడానికి రెడీ అంటున్నరు.


కార్మిక సోదరలకు మనవి :


‘పుడితొక్కటి సస్తె రెండు.. రాజిగ ఒరె రాజిగా..’ ఈ తర్కంతో ముందుకు పోదాం. ఎట్లయితే తెలంగాణ సాధించుకున్నమో.. గట్లనే సమస్యలను కూడా పరిష్కరించుకుందాం. డిమాండ్లను సాధించుకుందాం. ఇప్పటికే తెలంగాణ ఉద్యమంలో వేలాది మందిని పోగొట్టుకున్నం. ఇక కార్మికులు కూడా అదే బాటలో పోతే ఇది బంగారు తెలంగాణ కాదు, బొందల గడ్డ తెలంగాణ అయితది. కలిసి నడుద్దాం… కలిసి కలబడదాం.. ఆర్టీసీ కార్మికుల డిమాండ్లు పరిష్కారం అయ్యేదాక కొట్లాడుదాం.


#SaveRTC #Support_TSRTC #StandWithTSRTC_Employees

 


 

Copy link
WhatsApp
Facebook
Nextdoor
Email
X