

పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లోనే బోయలను ఎస్టీలుగా గుర్తించాలి లేదంటే బీజేపీకి బోయలు రాంరాం
ప్రస్తుతం బోయల యుద్ధం బీజేపీతోనే కాదంటే ప్రత్యామ్నాయ పార్టీలైన కాంగ్రెస్, బీఎస్పీలతో దోస్తీకి సై
రెండు తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో వాల్మీకి బోయలు అన్యాయంగా తొలగించిన ఎస్టీ హోదాను తిరిగి పునఃరుద్దరించమని గత 60 ఏళ్లుగా పోరాటం చేస్తున్నారు. అన్ని పార్టీల నాయకులు బోయలను ఎస్టీలుగా తిరిగి పునఃరుద్దరిస్తామని, బోయలను ఎస్టీలుగా గుర్తించి విద్య, ఉపాధి, ఉద్యోగాల్లో ఎస్టీ రిజర్వేష్ ను కల్పిస్తామని మాట ఇచ్చి మోసంచేశారు. సుమారు 6 లక్షల జనాభా తెలంగాణలో ఉంటే, ఏపీలో 60 లక్షల జనాభా ఉన్న వాల్మీకి బోయలను అన్ని రాజకీయ పార్టీలు మోసం చేస్తూనే ఉన్నాయి.
ఇటు తెలంగాణలో బీఆర్ఎస్ ముఖ్యమంత్రి కేసీఆర్ 2014 ఎన్నికల ముందు బోయలను ఎస్టీలుగా గుర్తించే ఫైలుపై తొలిసంతకం పెడతానన్నారు. ఆయన ఇచ్చిన మాట ప్రకారం రాజ్యాంగ నిబంధనలకు లోబడి 2015లో డా. చెల్లప్ప కమిషన్ వేసి బోయలు, ఖైతిలంబాడీల జీవన, ఆర్థిక, సామాజిక స్థితిగతులను అధ్యయనం చేయడానికి త్రిసభ్య కమీషన్ వేశారు. సుదీర్ఘ అధ్యయనం అనంతరం ఆ కమీషన్ 2017లో కేసీఆర్ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. ఉమ్మడి ఏపీ విభజన అనంతరం తెలంగాణ రాష్ట్రంలో 2011 సెన్సస్ ప్రకారం 9.02 శాతం ఎస్టీలు ఉన్నారని… జనాభాలో 0.98 శాతం ఉన్న బోయ, ఖైతీలంబాడీ జాతులు అత్యంత దయనీయస్థితిలో ఉన్నారని, వారిని ఎస్టీలుగా గుర్తించి 12 శాతం రిజర్వేషన్ కల్పించవచ్చని నివేదిక ఇచ్చింది. అదే నివేదికను కేసీఆర్ ప్రభుత్వం అదే ఏడాది అసెంబ్లీలో మైనార్టీ, ఎస్టీ రిజర్వేషన్ ను పెంచుతూ బిల్లును ప్రవేశపెట్టి కేంద్రానికి పంపారు. ఆ నివేదిక తమకు అందలేదని కేంద్రమంత్రులు, లేదు పంపామని రాష్ట్రమంత్రులు ఒకరిమీద ఒకరు బురదజల్లుకునే కార్యక్రమం చేసి ఆ బిల్లు ఎటు కాకుండా చేశారు. రాష్ట్ర గిరిజన శాఖ మంత్రి సత్యవతిరాథోడ్ గిరిజన రిజర్వేషన్ బిల్లును కేంద్రానికి పంపినట్టు మీడియా ముందుకు వచ్చి కేంద్రానికి పంపిన లెటర్స్ ను ఆధారాలతో సహా చూపించారు. అయితే ఆ బిల్లును మైనార్టీ బిల్లుతో కలిపి పంపారని సెపరేటుగా పంపమని మళ్లీ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ పంపినట్టు కేంద్ర గిరిజన శాఖ మంత్రి వెల్లడించారు. ఇలా ఒకరు మీద ఒకరు నెట్టేసుకుంటూ బోయలను ఎస్టీలుగా గుర్తించకుండా రెండు ప్రభుత్వాలు వాల్మీకి బోయలను మోసం చేశారు.
తమకు జరుగుతున్న అన్యాయాన్ని గమనించిన వాల్మీకి బోయ సంఘాలు తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉద్యమం లేవనెత్తారు. ఉమ్మడి మహబూబ్ నగర్ లోని ఎమ్మెల్యేలను, మంత్రులను ఎక్కడికక్కడ నిలదీశారు. జిల్లా పర్యటనకు వచ్చిన మంత్రి కేటీఆర్, సీఎం కేసీఆర్ కాన్వాయ్ ను అడ్డుకుని నిరసన గళం వినిపించారు. సుమారు రెండు నెలలపాటు గద్వాల వేదికగా తెలంగాణ వాల్మీకి ఐక్యసంఘం తరపున రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో ఆమరణ నిరాహారదీక్షలు చేపట్టగా దిగొచ్చిన కేసీఆర్ ప్రభుత్వం తాజాగా మరోసారి వాల్మీకి బోయలను గిరిజనులుగా చేర్చాలని మరో బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టి కేంద్రానికి పంపింది. ఆ బిల్లు పంపి కూడా సుమారు 6 నెలలు కావస్తోంది. ఇంతవరకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నుంచి ఉలుకు లేదు, పలుకు లేదు. అంతకు ముందు బోయల ఎస్టీ ఉద్యమానికి రాష్ట్ర బీజేపీ నాయకులు సైతం మద్దతిచ్చారు. బోయలను ఎస్టీలుగా చేర్చాలని బిల్లే రాలేదని సెపరేటుగా పంపితే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తప్పకుండా చేస్తుందని అప్పటి రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్, ఎంపీ ధర్మపురి అరవింద్, కేంద్రమంత్రి, ప్రస్తుత రాష్ట్ర బీజేపీ అధ్యక్షలు సైతం ప్రగల్భాలు పలికారు. మరి ఇప్పుడు ఏమైంది మీరిచ్చిన హామీ అని వాల్మీకి బోయలు అడుగుతున్నారు వారికి ఇప్పుడు మీరేమి సమాధానం చెబుతారు. మాజీ మంత్రి, ప్రస్తుత రాష్ట బీజేపీ ప్రచార కమిటీ అధ్యక్షులు ఈటల రాజేందర్ కూడా అప్పటి ప్రభుత్వంలో ఉన్నప్పుడు, బీజేపీలో చేరాక ఎన్నోసార్లు వాల్మీకి బోయ సంఘాల నాయకులు కలిసి వినతి పత్రాలు ఇచ్చారు. మరి ఇప్పుడు ఆయన కూడా నిమ్మకు నిరెత్తనట్టు గమ్ముగా ఉన్నారు. ఇచ్చిన హామీలు మరిచి ఇప్పుడు ఏ మొఖం పెట్టుకొని ఓట్లు అడగటానికి వస్తారని ప్రశ్నిస్తున్నారు వాల్మీకి బోయలు.
అటు అంధ్రప్రదేశ్ లో గత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేబినెట్ తీర్మానం చేసి కేంద్రానికి పంపారు. ప్రస్తుత సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత వాల్మీకి బోయలకిచ్చిన హామిని నేరవేర్చడానికి మరో కొత్త సమస్యను తీసుకొచ్చారు. రాయలసీమలోని పాత నాలుగు జిల్లాలనే ఎస్టీలుగా గుర్తించాలని తీర్మానం చేసి ప్రవేశపెట్టారు. దీంతో వాల్మీకి బోయల నుంచి నిరసనలు చెలరేగాయి. పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తం చేశారు. తాను పాదయాత్ర సమయంలో తమకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేదంటున్నారు. కర్నూల్ కు వచ్చిన ప్రధానమంత్రి మోడీజి కూడా వాల్మీకి బోయలది న్యాయమైన డిమాండ్ అని రాష్ట్ర ప్రభుత్వాలు బోయలను ఎస్టీలుగా గుర్తించే బిల్లును కేంద్రానికి పంపితే తాము తప్పకుండా చేస్తామని హామి ఇచ్చారు. దీనికి ఆ రాష్ట్ర బీజేపీ గత అధ్యక్షుడు సోము వీర్రాజు, ప్రస్తుత అధ్యక్షురాలు పురంధీశ్వరి దేవీలు మోదీజీ ఇచ్చిన మాట ఎందుకు నిలబెట్టుకోలేదో ఏపీ వాల్మీకి బోయలకు సమాధానం చెప్పాలంటున్నారు ఏపీ బోయలు. వాల్మీకి నాయకులకు పదవులు ఆశచూపి తమ చిరకాల వాంఛ అయిన ఎస్టీ హోదాను మరిచిపోతారని అనుకోవడం పొరపాటని ఆ రాష్ట్ర నాయకులు మరో ఉద్యమానికి సిద్దమవుతున్నారు.
ఇటు కాంగ్రెస్ పార్టీ నాయకులు గత ముఖ్యమంత్రి, దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి హామీ ఇచ్చినా నెరవేర్చలేకపోయారు. ప్రస్తుతం ఏపీ, తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ నాయకులు రేవంత్ రెడ్డి, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డిలు, జీవన్ రెడ్డి వాల్మీకి బోయలను ఎస్టీలు గుర్తించకుడా సీఎం కేసీఆర్ మోసం చేస్తున్నారని మాట్లాడినవాళ్లే. మరి ఇప్పుడు ఎందుకు ఈ విషయంపైన ఇటు రాష్ట్ర ప్రభుత్వాలను కానీ, కేంద్ర ప్రభుత్వాన్ని కానీ నిలదీయడం లేదు. దీని వెనక ఎవరి హస్తం ఉందన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎవరు అడ్డుకుంటున్నారని ప్రశ్నిస్తున్నారు. వాల్మీకి బోయలు. తాము ఎస్టీలో చేరితే… ఏపీలో అధిక సంఖ్యలో ఉన్న వాల్మీకి బోయలు తమ పదవులకు పోటీ వస్తారని రెడ్డి సామాజిక వర్గం భావిస్తోందా? దీనిపై ఉమ్మడి ఏపీకి చెందిన మాజీ సీఎం, ప్రస్తుత బీజేపీ జాతీయ కార్యదర్శి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, ప్రస్తుత తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉందంటున్నారు వాల్మీకి బోయ సంఘాల నేతలు. లేదంటే వచ్చే ఎన్నికల్లో ప్రతి నియోజకవర్గంలో తామే ఎన్నికల్లో నిలబడతామని బాహాటంగానే చెబుతున్నారు వీళ్లు.
దేశ వ్యాప్తంగా తమ సామాజిక వర్గం ఎస్సీ, ఎస్టీలుగా ఉంటే ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే రాజ్యాంగానికి విరుద్దంగా ఒకే సామాజిక వర్గానికి ఏజెన్సీ వాల్మీకులు ఎస్టీలుగా , మైదాన ప్రాంత వాల్మీకులు బీసీలుగా విడదీసి దేశంలో ఎక్కడా లేని అసమానతలను తీసుకొచ్చారు ఆనాటి పాలకులు. వాల్మీకి బోయలు ఆదిమజాతికి చెందిన తెగగా ఎడ్గర్ థరస్టన్. వంటి ఎంతో మంది పరిశోధకులు తమ పుస్తకాల్లో రాశారు. ఆనాటి మద్రాస్ ప్రభుత్వ గెజిట్ లో ప్రకటించారు. ఎన్నో కమిటీలు వాల్మీకి బోయలపై అధ్యయనం చేశాయి. ఏపీలో సత్యపాల్ కమిటీ, ఒన్ మ్యాన్ కమిషన్ ఇటు తెలంగాణలో చెల్లప్ప కమిషన్ ల వంటి ఎన్ని నివేదికలు చెప్పినా వీరి చెవికి ఎక్కడం లేదంటున్నారు నాయకులు. ఇక ప్రత్యక్షపోరాటమే తమ ముందున్న లక్ష్యం అంటున్నారు రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన వాల్మీకి సంఘ నాయకులు. తాము రాజ్యాంగ బద్దంగా, శాంతంగా అడిగితే ఈ పాలకులు మాట వినేటట్టు లేరని అనుకుంటున్నారు. ఏపీలో కాపులకు, ఈబీసీలకు జరిగిన సత్వర న్యాయం వాల్మీకి బోయల విషయంలో ఎందుక జరగడం లేదని నిలదీస్తున్నారు. బీసీలలో ఉన్నా బీసీ పథకాలకు దూరమవుతున్నామని వాపోతున్నారు. బీసీలలో ఆరేడు సామాజిక వర్గాల వారే అన్ని రకాల లబ్ది పొందుతున్నారని అత్యంత వెనకబడిన వాల్మీకి బోయలకు విద్య, ఉద్యోగం, రాజకీయాలలో సరైన ప్రాతినిధ్యం ఇవ్వడం లేదని వాపోతున్నారు. భారత రాజ్యాంగం ప్రకారం తమకు దక్కాల్సిన సామాజిక న్యాయం జరగడం లేదంటున్నారు నేతలు. ఇప్పటికైనా కళ్లు తెరచి ఇంకా ఎన్నికలకు రెండు మూడు నెలల సమయం ఉన్నందున ఈ వర్షాకాల పార్లమెంటు సమావేశాల్లో వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో చేర్చే విధంగా బీజేపీ నేతలు కేంద్రమంత్రులు, ప్రధాని మోదీపై ఒత్తిడి తీసుకురావాలని కోరుతున్నారు. ఇతర పార్టీల ఎంపీలు కూడా వాల్మీకి బోయలను ఎస్టీలుగా చేర్చాలని పార్లమెంటులో తమ మద్దతు ప్రకటించి తమ వాయిస్ వినిపించాలని కోరుతున్నారు.
-వెంకటేశ్వర్లు బోయ, తెలంగాణ జర్నలిస్ట్, హైదరాబాద్