Victoria Memorial Home
2017/09/06
“వి.ఎం.హోమ్ … ఇది ప్రభుత్వ భూమి కాదు, ఇది పోలీసుల భూమి కాదు. ఇది ప్రజల భూమి. ఇది పిల్లల భూమి. దీనిని పిల్లల భూమిగానే వుండనివ్వండి. గడచిన చరిత్రలో తప్పిదాలను పునరావృతం చేయకండి”. - Vasireddy Venugopal (Senior Journalist) తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాచకొండ పోలీస్ కమిషనరేట్ ఏర్పడింది. దీని ప్రధాన కార్యాలయాన్ని కొత్తపేటలో వుండే విక్టోరియా మెమోరియల్ హోం (వి.ఎం.హోమ్) ఆవరణలో ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. …. వి.ఎం.హోమ్ నేపధ్యం: నిజాం నవాబు తన వేసవి విడిదికోసం ఈ భవనాన్ని కట్టించుకున్నారు. వనస్థలిపురంలోని జింకలపార్కులో వేటకు వచ్చే నవాబు.. విడిది వసతిగా నిర్మించుకున్నారు. అయితే మతపరమైన ఆచారాల రీత్యా ఒక అపశకునం ఎదురుకావడం వల్ల.. ఆ భవంతిలోకి తాను ప్రవేశించలేదు. అనాధ బాలలకు విద్య, వసతి సదుపాయాలు కల్పించడానికి దానికి కేటాయించారు. అదే వి.ఎం.హోమ్. విశాల ప్రాంగణంలో వుండే ఈ భవంతితో పాటు సువిశాల క్రీడా ప్రాంగణం, ఏపుగా పెరిగిన చెట్లు ఇందులో వుంటాయి. పరిసర ప్రాంత కాలనీల వారికి వాకింగ్, జాగింగ్ సదుపాయాన్ని, ఆక్సిజన్ బ్రీతింగ్ సదుపాయాన్ని ఈ ప్రాంగణం కల్పిస్తోంది. ఈ ప్రాంగణం చారిత్రక ప్రాధాన్యత కలిగినది. చారిత్రక భవనం. చారిత్రక, సాంస్కృతిక వారసత్వ భవనం, ప్రాంగణం. భారతదేశ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ సందర్శించిన ప్రాంగణం. తన స్వహస్తాలతో ఈ ప్రాంగణాన్ని అభినందిస్తూ ఒక లేఖ రాసిన ప్రాంగణం. … 1999నుంచి డేగల కన్ను: వీఎం హోమ్ భూములపై ప్రభుత్వాలకు, ప్రభుత్వ పెద్దలకు 1999నుంచి కన్నుపడింది. జాతీయ రహదారిపై ప్రధాన ప్రాంగణానికి ఎదురుగా కూడా హోమ్ భూమి వుంది. చంద్రబాబు హయాంలో ఆ భూమిపై జెండా పాతారు. ఇప్పుడు వున్న కొత్తపేట రైతు బజారు (సరూర్ నగర్ రైతు బజార్ అంటారు), దానికి కుడివైపున వుండే రిలయన్స్ పెట్రోలు బంకు, దాని పక్కన వుండే రిలయన్స్ టవర్.. వి.ఎం.హోమ్ వాళ్ల భూముల్లో లీజుకిచ్చినవే. ఒక ప్రెవేటు సంస్థకు హోం భూములు లీజుకు ఇవ్వడంపై రగడ కావడంతో రైతు బజారుకు ఎడమవైపున.. అదే హోం భూమిలో బీజేఆర్(బాబూ జగజీవన్ రాం) భవన్ ను ప్రభుత్వం నిర్మించింది. బీజేఆర్ భవన్ తర్వాత.. టెలిఫోన్ కాలనీకి వెళ్లే రోడ్డు వుంటుంది. ఆ రోడ్డుకి ఆనుకుని వుండే భూమి కూడా వీఎం హోం వారిదే. ల్యాండ్ మార్క్ గా చెప్పాలంటే.. స్పైసీ హబ్ అని వుంటుంది. ఆ భూమి వీఎం హోమ్ ది. సుమారు కోటి రూపాయలు చెల్లించి కొనుగోలు చేశారు. అక్రమ లావాదేవీ. విక్రయదారులకు, కొనుగోలుదారులకు యాజమాన్య హక్కులు లేని అక్రమ లావాదేవీ. రిలయన్స్ బంక్, రైతు బజార్, బీజేఆర్ భవనానికి వెలుపల.. ఇంకా అంత స్థలం ఇప్పటికీ ఖాళీగా వుంది. అది కూడా వీఎం హోం భూమినే. ఇది కాకుండా సమీపంలోని ఎన్టీఆర్ నగర్ లో కొంచెం లోపలికి ఏడెకరాల భూమి వుంది. అందులో కూరగాయలు పండించి, వాటితో.. హోంలోని పిల్లలకు వంటలు వండుతుంటారు. … ఈ భూమి ఎవరిది? ప్రభుత్వాలు.. ఈ భూమిని ప్రభుత్వ భూమికింద జమకట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. నిజానికి ఇది ప్రభుత్వ భూమి కాదు. వీఎం హోమ్ కి మాత్రమే చెందుతుంది. వీఎం హోంకి చెందకపోతే.. నిజాం ట్రస్ట్ కి చెందుతుంది. …. 2004 తర్వాత వైఎస్సార్ కన్నుపడింది… వైఎస్సార్ అధికారంలోకి వచ్చాక వీఎం హోమ్ భూమిని, ప్రధాన ప్రాంగణాన్ని ప్రెవేటు సంస్థలకు లీజుకి ఇచ్చి కమర్షియల్ గా మార్చడానికి పెద్ద ప్రయత్నం జరిగింది. కానీ వీఎం హోం గట్టిగా ప్రతిఘటించింది. ఆ తర్వాత… ఇటీవలి కాలంలో ఎల్ అండ్ టీ మెట్రో రైల్ వాళ్లు కూడా అక్కడో మాల్ ఏర్పాటు చేసుకోవడంకోసం ఆ భూమికోసం వచ్చారు. ప్రతిఘటన కొనసాగింది. …… లీజు రేట్లలో ఇంత వ్యత్యాసమా? రాచకొండ పోలీసు కమిషనరేట్ కి.. ఇప్పుడున్న రైతుబజార్ వెనుక ప్రాంగణాన్ని మొదట పరిశీలించారు. అయితే మెయిన్ రోడ్డుపై కావాలని.. ప్రధాన ప్రాంగణాన్ని ఎంచుకున్నారు. అంటే.. అక్కడున్న చెట్లన్నీ నరికి పోలీస్ కమిషనరేట్ ఏర్పాటు చేస్తారు. తొలుత ప్రభుత్వ జీవీలో మార్కెట్ ధర ప్రకారం ఏడాదికి సుమారు కోటి రూపాయలు లీజ్ రుసుము చెల్లించాలని పేర్కొన్నారు. తాజాగా ఇచ్చిన జీవోలో లీజుని ఐదున్నర లక్షలకు తగ్గించారు. దాదాపు 95శాతం తగ్గించారు. ….. ఈ సందర్భంగా కొన్ని విషయాలు, కొన్ని వాస్తవాలు మాట్లాడుకోవాలి. మొదటిది: 1999లో రైతు బజారు ఏర్పాటు చేసినప్పుడు ఖరారు చేసిన లీజు విలువను.. ఇప్పుడు రాచకొండ కమిషనరేట్ ఏర్పాటుకు ప్రామాణికంగా పరిగణించడం న్యాయమా? అదే ప్రామాణికంగా తీసుకోదలచుకుంటే.. రైతు బజారు వెనక వున్న ఖాళీ స్థలాన్నో, ఎన్టీయార్ నగర్ లో వున్న ఖాళీ స్థలాన్నో కేటాయించండి. ప్రధాన ప్రాంగణంలో వద్దు. రెండవది: రైతు బజారు ఏర్పాటైన తర్వాత.. అప్పుడు ఖరారు చేసిన అతి తక్కువ లీజు ధరను కూడా ఇప్పటివరకూ వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ.. వీఎం హోమ్ చిన్నారులకు ఒక్క నయాపైసా కూడా చెల్లించలేదు. ఆ బకాయిల మొత్తం ఇప్పుడు 2కోట్లు దాటిపోయింది. రైతు బజారులో బోర్డుమీద 21రూపాయలు వున్న బెండకాయలను 22 రూపాయలకు అమ్ముతున్నందుకు గాను మనం బాధ్యతాయుత పౌరులుగా చాలా గోలచేస్తాం. అధికారులకు కంప్లెయింట్ చేస్తాం. కానీ.. చిన్నారులకు అన్నం పెట్టాల్సిన ఈ రెండు కోట్ల రూపాయల బకాయి గురించి మనకు అస్సలు తెలియదు. అది మన ప్రపంచం కాదు. మూడవది: ఇప్పటికీ వీఎం హోమ్ కి రెగ్యులర్ గా లీజు డబ్బులు అందుతున్నది.. ప్రెవేటు సంస్థ రిలయన్స్ నుంచే. పెట్రోలు బంకు ద్వారా నెలకు లక్షా 22వేల రూపాయలు, సెల్ ఫోన్ టవర్ ద్వారా సుమారు 7వేల రూపాయలు అందుతున్నాయి. నాలుగవది: అది ప్రభుత్వ భూమే అనుకుంటే అనుకోండి. ఎలాగూ భూముల రీసర్వే చేపట్టారు. అది ప్రభుత్వ భూమే అని తేలినట్టయితే ఒక పని చేయండి. ఎన్నేళ్లకు లీజుకు ఇస్తున్నారో, ఏ రేటుకి లీజుకి ఇస్తున్నారో.. ఆ మొత్తాన్ని ముందుగా ఆ పిలకాయల సంక్షేమంకోసం నగదు బదిలీ చేయండి. తర్వాత.. ఆ లీజు హక్కుల్ని అనుభవించండి. వందేళ్లుగా ఆ భూమిని కాపాడుకున్నది ప్రజలు. వందేళ్లుగా ఆ భూమిపై సమిష్టి హక్కులను అనుభవిస్తున్నది ప్రజలు. ఇది ప్రభుత్వ భూమి కాదు, ఇది పోలీసుల భూమి కాదు. ఇది ప్రజల భూమి. ఇది పిల్లల భూమి. దీనిని పిల్లల భూమిగానే వుండనివ్వండి. గడచిన చరిత్రలో తప్పిదాలను పునరావృతం చేయకండి. (Note: కేసీఆర్ ఖ‌బ‌ర్ధార్!విక్టోరియా మెమోరియ‌ల్ హోంలో నేను(వెంక‌టేశ్వ‌ర్లు బోయ‌) కూడా 10వ త‌ర‌గ‌తి వ‌ర‌కు(1994-97) చ‌దువుకున్నాను. ఎంతో మంది అనాధ పిల్ల‌లను అక్కున చేర్చుకుంది. వ‌ల‌స వ‌చ్చిన మాబోటి వాళ్ల‌కు ఆశ్ర‌యిమిచ్చి ఆదుకుంది. ఇప్ప‌టికీ అదొక మ‌హా విద్యా సంస్థ‌, స్వ‌తంత్ర‌ప్ర‌తిప‌త్తి గల వీఎంహోం భూముల‌ను క‌బ్జా చేయాల‌ని గ‌త కొన్నేళ్లుగా ప్ర‌భుత్వాలు కుట్ర‌ల మీద కుట్ర‌లు చేస్తున్నాయి. ఇదివ‌ర‌కు చాలా మంది ట్రై చేశారు.. ఇప్పుడు సీఎం కేసీఆర్ కన్నుప‌డింది. కానీ వాళ్ల ఆట‌లు మా పూర్వ విద్యార్థులం సాగ‌నివ్వం. ఇప్ప‌టికే అంద‌రం స‌పోర్ట్ గా నిలుద్దామ‌ని కార్య‌చ‌ర‌ణ మొద‌లు పెట్టాం.. తీవ్ర ఉద్య‌మం మొద‌ల‌వుతుంది.. అనాధ పిల్ల‌ల జోలికి వ‌స్తే.. కేసీఆర్ ఖ‌బ‌ర్ధార్.. అటు వైపు క‌న్నేస్తే.. విద్యార్థుల ఉప్పెన‌కు బ‌లైపోతావ్ జాగ్ర‌త్త‌..! వీఎం హోం చ‌రిత్ర‌ను ప్ర‌జ‌ల‌కు తెలియ‌జేసి వాళ్ల‌ను చైతన్య ప‌రిచిన సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టు వాసిరెడ్డి వేణుగోపాల్ అన్న‌కు ధ‌న్య‌వాదాలు.)) -Venkateshwarlu Boya, Telangana Journalist (www.telanganajournalists.com) Borabanda, Hyderabad-18.
リンクをコピー
Facebook
WhatsApp
X(旧:Twitter)
Eメール