

#NoReligionNoCaste -
మా పోరాటానికి పదేళ్ల సందర్భంలో నాలుగు మాటలు మీతో..
" మతం నమ్మడానికి హక్కు ఉందంటే,
ఏ మతం నమ్మకుండా ఉండడానికీ హక్కు ఉన్నట్లే.. "
మిత్రులారా ..
మేమడుగుతున్న " మత రహిత , కుల రహిత " అస్తిత్వ పోరాటానికి ఈ నెల అంటే 26 ఏప్రిల్,2020 నాటికి 10 ఏళ్లు పూర్తవుతాయి.. వాస్తవానికి మా పోరాటం మా చిన్న అమ్మాయి సహజ ను స్కూల్ లో జాయన్ చేయడానికి బయలుదేరినపుడే అంటే డిసెంబర్ ,2009 లోనే మొదలయింది .. అయితే 2010 ఏప్రిల్ లో న్యాయవాది డి సురేష్ కుమార్ గారు అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో రిట్ పిటిషన్ వేశారు .. అప్పుడు మా రిట్ పిటిషన్ పై జస్టిస్ సి.వి. నాగార్జున రెడ్డి గారు స్పందిస్తూ.. " మతం నమ్మడానికి హక్కు ఉందంటే, ఏ మతం నమ్మకుండా ఉండడానికీ హక్కు ఉన్నట్లే.. " అని అంటూ స్కూల్ యజమాన్యం అప్లికేషన్ లో పిటిషనర్ మతం రాయని కారణంగా దరఖాస్తును తిరస్కరించడానికి వీలు లేదన్నారు.. ఆ విధంగా మా చిన్న అమ్మాయిని " నో రెలిజియన్ నో క్యాస్ట్ " అని అప్లికేషన్ లో రాసి , స్కూల్ లో జాయన్ చేసాం .. తరవాత అదే స్కూల్ లో జాయిన్ అయిన పెద్దమ్మాయి స్పందన విషయం లో జాయిన్ అయేటపుడు , స్కూల్ నుంచి టీ. సి తీసుకునేటపుడు " నో రెలిజియన్ నో క్యాస్ట్ " అనే తీసుకున్నాం ..
ఇక్కడితో కథ అయిపోలేదు..
మళ్లీ పెద్ద అమ్మాయి ఇంటర్మీడియట్ లోనూ సమస్యే.. పరీక్షల సందర్భంలో ఆన్ లైన్ అప్లికేషన్ లో - అన్ని మతాలవారికి వారి అస్తిత్వం ప్రకటించుకునే అవాకాశం ఉంది కాని , మాలాంటి వారికి మతం కిందే " అదర్స్ " అనే ఆప్షన్ ఉంది.. తప్పని స్థితిలో " అదర్స్ " నింపి , మార్చ్ , 2017 లో మాలాంటి వారి సమస్యను శాస్వతంగా పరిష్కరించమని కోరుతూ తెలంగాణ రాష్ట్ర హై కోర్టులో ఈసారి ప్రజా ప్రయోజన వ్యాజ్యం ( పబ్లిక్ ఇంటెరెస్ట్ లిటిగేషన్ - డబ్ల్యూ. పి. - పి. ఐ . ఎల్ నెం. 66/2017) ) వేశాం .. ఆ వ్యాజ్యానికీ 3 ఏళ్లు పూర్తయ్యాయి .. ఇంకా తుది తీర్పుకోసం ఎదురు చూపులే .. మా పిల్ పిటిషన్ లో మాకు మద్దతుగా డెమొక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ ( డి.టి.ఎఫ్ ) వారు ఇంప్లీడ్ అయ్యారు.. అనేక ప్రజా సంఘాలు మాకు మద్దతుగా నిలిచాయి ..
ఈ పరిస్థితిని 10 ఏళ్లుగా మేము మీ అందరి దృష్టికీ వేరు వేరు సందర్భాలలో తెస్తూనే ఉన్నాం.. మేము ఆన్ లైన్ లో మొదలు పెట్టిన " నో రెలిజియన్ నో క్యాస్ట్ చేంజ్ డాట్ ఆర్గ్ పిటిషన్ లో " మీలో చాలామంది సంతకాలు కూడా చేశారు.. అయితే, ఒక చిన్న ప్రజాస్వామిక ఆకాంక్ష విషయంలో ఎందుకింత జాప్యం ..
ఈలోపు మనందరికీ ఉత్సాహం కలిగించే పరిణామం ఒకటి జరిగింది.. తమిళనాడులో ఎం.ఎ. స్నేహ గారు " మత రహిత , కుల రహిత సర్టిఫికేట్ " ( 05.02.2019 న ) పొందిన మొదటి మహిళ గా విజయం సాధించారు.. ఈ పరిణామం తెలంగాణలో మా ప్రయత్నానికి బలాన్నిస్తుందని ఆశపడ్డాం.. కానీ కాలేదు..
గత ఏడాది భగత్ సింగ్ వర్ధంతి రోజున అంటే 23 మర్చ్ ,2019 న మిత్రులు డేవిడ్ , రూప దంపతులకు బాబు పుట్టాడు .. వారు కూడా తమ బాబు బర్త్ సర్టిఫికేట్ ను " మత రహిత , కుల రహిత " అస్తిత్వం తో కావలని పురపాలక అధికారులను కోరినపుడు వారు వీలుకాదన్నారు.. అప్పుడు వాళ్లు కూడా హై కోర్టు లో ప్రజా ప్రయోజన వ్యాజ్యం ( డబ్ల్యూ. పి. - పి. ఐ . ఎల్ నెం. 31/2020) దఖలు చేశారు .. వాళ్ల బాబు ఇవాన్ రూడే కు ఈ మార్చ్ 23న ఏడాది నిండాయి .. ఇంకా బర్త్ సర్టిఫికేట్ రాలేదు.. ఎదురు చూపులే..
అయితే మా కుటుంబం , మిత్రులు డేవిడ్ కుటుంబం కలిసి - తెలంగాణ రాష్ట్ర ఐ టి మంత్రి కె టి రామారావు గారు సహా , ఇతర ప్రజా ప్రతినిధులను కలిసి మా విషయం లో చొరవ చేసి ఒక విధాన నిర్ణయం తీసుకోమని అడుగుదామని భావించాం.. పదేళ్ల సందర్భంగా ఒక సభ పెడదామని అనుకున్నాం .. ఈలోపు కరోనా వచ్చి దేశ , రాష్ట్ర పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి..
అయితే , మా పోరాటానికి పదేళ్ల సందర్భంలో .. మీ అందరికీ ఒక విన్నపం ..
- మీరు మీకున్న మతాన్ని , మీ విశ్వాసాన్ని ప్రకటించుకోగలుగుతున్నారు.. మరి మీ విశ్వాసం ఏదయినా ఒక ప్రజాస్వామిక దృష్టితో మా అస్తిత్వ ప్రకటనకూ మీరంతా మద్దతివ్వాలి .. ఇది కేవలం మత విశ్వాసం లేని వారి సమస్య ఎంత మాత్రం కాదు .. ఒక ప్రజాస్వామిక ఆకాంక్షకు మనం మద్దతు ఇస్తామా, లేదా అనేది ప్రశ్న..
- మేము ఆన్ లైన్ పిట్టిన - " నో రెలిజియన్ నో క్యాస్ట్ చేంజ్ డాట్ ఆర్గ్ పిటిషన్ " లో సంతకాలు చేసి మాకు సహకరించండి .. మా పిటిషన్ ను ఇప్పటికి 48,351 మంది చూశారు.. 7654 మంది సంతకాలు చేశారు .. 6635 మంది మా పిటిషన్ ను షేర్ చేసి సహకరించారు (19.04.2020 నాటికి) .. తెలుగు రాష్ట్రాల నుంచి, దేశం లోని వివిధ రాష్ట్రాలనుంచి, విదేశాలనుంచి ఎంతో స్పందించి మాకు మద్దతు పలికారు..
- మీకు అవకాశం ఉంటే, విధాన నిర్ణయాలు చేయగలిగే ప్రజా ప్రతినిధుల దృష్టికి మా సమస్యను తీసుకు వెళ్లండి .. పుట్టక నుండి చావుదాకా, చదువుల్లో , ఉద్యోగాల్లో ఎక్కడ అవసరమయినా అలా అవసరమయినవారికి మత రహిత, కుల రహిత అస్తిత్వం ప్రకటుంచుకునే అవకాశం ఇవ్వమని అడ్గుగుదాం. తమిళనాడు లో స్నేహ గారు వ్యక్తిగత స్థాయిలో మత రహిత , కుల రహిత సర్టిఫికేట్ ను సాధించారు .. అయితే మనం మన తెలంగాణ లో మత రహిత , కుల రహిత ఆప్షన్ ను అన్ని అప్లికేషన్ లలో ప్రకటించుకునే అవకాశం కలిగించి, అలా ఇచ్చిన మొదటి రాష్ట్రంగా ఆ ఘనతను సొంతం చేసుకుందాం .. ( వామ పక్ష పార్టీలు అధికారం లో ఉన్న చోట కూడా అటువంటి అవకాశం ఉన్నట్లు లేదు )
- మాలాగే మత రహిత, కుల రహిత అస్తిత్వ అవసరం ఉన్న వారు ఎక్కడికక్కడ పిటిషన్ లు వేయండి ..
- మనమంతా కలిసి భగత్ సింగ్ , అంబేద్కర్ , ఫూలే , పెరియార్ సహా అనేక మంది మహనీయులు కన్న కలలు నిజం చేసుకుందాం ..
- మత రహిత , కుల రహిత అస్తిత్వ ప్రకటనే దానికదిగా ఎదో పెద్ద మార్పని మేము భావించడంలేదు.. అలా ప్రకటించుకున్నంత మాత్రాన అన్నీ మారిపోతాయనీ అనుకోవడం లేదు .. అయితే అటువంటి స్పృహ మన సమాజానికి తప్పక అవసరమని గట్టిగా భావిస్తున్నాం..
- మన దేశంలో ప్రతి పదేళ్లకొకసారి చేపట్టే జనాభా లెక్కలను 2021 లో చేపట్టనున్నారు.. మనకు ఎక్కువ సమయం లేదు.. ఈలోపు మనం మత రహిత , కుల రహిత ఆప్షన్ ను సాధించుకుందాం.. జనాభా లెక్కలలోనూ మత రహిత, కుల రహిత అస్తిత్వ ప్రకటనకు అవకాశం ఉండాలని అడుగుదాం..
- మా పోరాట ఈ పదేళ్ల సందర్భాన్ని మీ పత్రికలలో , న్యూస్ చానెళ్లలో , సామాజిక మాధ్యమాలలో కవర్ చేసి ఎప్పటిలాగే మా పోరాటానికి సహకరిస్తారని ఆశిస్తున్నాం ..
- ఈ మొత్తం క్రమం లో మా సమస్యకు ఎప్పటికప్పుడు ప్రాధన్యతను ఇచ్చి కవర్ చేసిన అన్ని పత్రికలకు , న్యూస్ చానెల్స్ కు , సామాజిక మాధ్యమాలకు , మిత్రులందరికీ మరోసారి పేరు పేరునా హార్దిక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం..
ఇట్లు ,
సహజ, స్పందనల తల్లిదండ్రులు
- డి.వి.రామక్రిష్ణారావు, ఎస్.క్లారెన్స్ కృపాళిని