తెలంగాణ యువతకిచ్చిన లక్ష ఉద్యోగాల హామీని నెరవేర్చండి

0 have signed. Let’s get to 1,000!


తెలంగాణ ఉద్యమం నీళ్లు నిధులు నియామకాలు అనే మూడు అంశాల ఆధారంగా నిర్మాణమైంది. ఈ మూడు అంశాల్లో అత్యంత ఎక్కువగా ప్రభావితం చేసింది నియామకాల విషయంలో తెలంగాణ ప్రాంత యువకులకు జరిగిన అన్యాయమే. దాని కారణంగానే 1969 మొదలు 2014లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర నిర్ణయం వెలువడేంత వరకు విద్యార్థులు, యువకులు ఉద్యమంలో ఎంతో క్రియా శీలకంగా వ్యవహరించారు. 2009 నాటికిఅన్నిపార్టీలు తెలంగాణా రాష్ట్ర ప్రాధాన్యం గుర్తించడంలో విద్యార్థులు, యువకులు ప్రముఖ పాత్ర పోషించారు.

తెలంగాణ ఉద్యమంలో వివిధ కళాశాలలు, విశ్వవిద్యాలయాలు ఉద్యమ కేంద్రాలుగా మారాయి. ఉస్మానియా, కాకతీయ విశ్వవిద్యాలయాల విద్యార్థుల జేఏసీలు జేఏసీ కార్యక్రమాలకు వెన్నుదన్నుగా నిలిచాయి. విద్యార్థుల బలిదానాలు, త్యాగాలు ఉద్యమానికి ఊపిరిగా నిలిచాయి. మలిదశ తెలంగాణ ఉద్యమంలో శ్రీకాంతాచారి, యాదయ్య, కిష్టయ్యలతోపాటు వేయి మంది యువతీ యువకులు తమ బలిదానాల ద్వారా ఉద్యమానికి ప్రాణం పోశారు. అమరవీరులు రాసిన సూసైడ్ నోట్స్ యావత్తు తెలంగాణను కదిలించాయి. జాతీయ స్థాయి పార్టీలను, నేతలను ఆలోచింపజేశాయి.

తెలంగాణా రాష్ట్రం వస్తే మన ఉద్యోగాలు మనకు వస్తాయి, ఇక్కడి నిరుద్యోగులకు, యువతకు న్యాయం జరుగుతుందని అన్ని పార్టీలు చెప్పాయి. బొంబాయి, దుబాయి, బొగ్గుబాయి అని చెప్పుకునే తెలంగాణ ప్రజల బతుకులు మారుతాయని ఉద్యమంలో అన్ని పార్టీల నాయకులు చెప్పారు. ముఖ్యమంత్రి కెసిఆర్ గారు 2014 ఎన్నికల సందర్భంగా ఇంటికో ఉద్యోగం ఇస్తాం అని హామీ ఇచ్చారు.

తేదీ 10-03-2015 నాడు ముఖ్యమంత్రి హోదాలో నిండు శాసనసభలో రాష్ట్రంలో 1,12,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. నాటి బీజేపీ గౌరవ శాసనసభ్యులు శ్రీ డా లక్ష్మణ్ గారు, శ్రీ జి కిషన్ రెడ్డి గారు అసెంబ్లీలో ఉద్యోగాల గురించి చర్చ లేవనెత్తినప్పుడు సైతం 1,12,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, వాటిని వెంటనే భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. శాసన మండలిలో గౌరవ బీజేపీ నాయకులు ఎన్ రాంచందర్ రావు గారు అడిగిన ప్రశ్నకు లిఖిత పూర్వంగా డిపార్ట్మెంట్ వారీగా ఉన్న ఖాళీగా ఉన్న పోస్టులను సైతం వెల్లడించి మొత్తం 1,10,012 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని ప్రకటించారు.

ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీ కారణంగా కోటి ఆశలతో టి ఎస్ పి ఎస్సి కి 25 లక్షల మంది నిరుద్యోగులు ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్రంలో పదవీవిరమణ చేసిన ఖాళీలతో కలుపుకొని మొత్తం 2.5 లక్షల ఖాళీలు ఉన్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే, ఇప్పటివరకు భర్తీ చేసింది కేవలం 25 వేల ఉద్యోగాలే. అందులో సగం పోలీస్ డిపార్ట్మెంట్ కు సంబంధించినవే.

అన్ని విభాగాల్లో దాదాపు 10 నుండి 25 శాతం కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులతో కాలం వెళ్లదీస్తున్నారు. 8 ఏళ్ల నుండి గ్రూప్ 1 నోటిఫికేషన్ లేదు. 5 ఏళ్ల నుండి గ్రూప్ 3 నోటిఫికేషన్ లేదు. 5 ఏళ్ల నుండి ఒకే ఒక్క గ్రూప్2 నోటిఫికేషన్ వచ్చినా, ప్రభుత్వ నిర్వాకం వలన కోర్టుకేసుల్లో చిక్కుకొని అది కూడా ఫలితం లేకుండా పోయింది. 8 ఏళ్ల నుండి డిఎస్సి లేదు. తెలంగాణ ఏర్పడ్డ తరువాత ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే అన్ని గ్రూప్స్ లో రెండు నోటిఫికేషన్లను విడుదల చేసింది, డి ఎస్సి ప్రకటించి ఉపాధ్యాయులను నియమించింది.

తెలంగాణాలో ఐదేళ్ల నుండి ఉద్యోగాల కోసం నిరుద్యోగులు నిరీక్షిస్తున్నారు. టి ఎస్ పి ఎస్సి వార్షిక క్యాలెండర్ ప్రకటించకపోవడం వలన ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుందో, ఒకవేళ వస్తే పరీక్ష వ్రాసాక ఫలితాలు ఎప్పుడు విడుదల చేస్తారో, ఫలితాలు విడుదల చేసిన తరువాత పోస్టింగ్ ఎప్పుడు ఇస్తారో అని అర్ధం కాక నిరుద్యోగులు తీవ్రమైన మానసిక సంఘర్షణకు లోనవుతున్నారు.

ఇచ్చిన హామీకి తగ్గట్టుగా 1,12,000 ఉద్యోగాలను భర్తీ చేయడానికి టి ఎస్ పి ఎస్సి వద్ద ప్రణాళిక లేకపోవడం, నిబంధనల్లో స్పష్టత లేకపోవడం, నోటిఫికేషన్లు తయారు చేయడంలో లోపాలు, న్యాయపరమైన చిక్కులను సమర్ధవంతంగా ఎదుర్కోవడంలో వైఫల్యం, పరీక్ష పేపర్లలో, కీ లో తప్పులు దొర్లడం వంటి అంశాలు ఉద్యోగార్థులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి.

ఇప్పటికే ఈ ఐదేళ్లలో కోచింగ్ సెంటర్ల ఫీజులకు, హాస్టల్ ఫీజులకు సగటున ఒక్కొక్కరు లక్షన్నర రూపాయలు, పరీక్షా రుసుముల కింద ఒక్కొక్కరు సగటున 20 వేల రూపాయలు ఖర్చు చేశారు. ఐదు సంవత్సరాల నుండి ఉద్యోగాలు రాకపోవడంతో ఒకవైపు వయస్సు పెరిగిపోయి అనర్హులుగా మిగిలిపోతామేమో అని ఆందోళన చెందుతున్నారు, ఇంకో వైపు పెళ్లిళ్లు కాక ఇంట్లో, సమాజంలో అనేక అవమానాలకు గురవుతున్నారు. వీటి కారణంగా తీవ్రమైన మానసిక ఒత్తిడితో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. సోషల్ మీడియా ద్వారా అనేక మంది ఉద్యోగార్థులు తమకు ఆత్మహత్యలు తప్ప వేరే దిక్కు లేదని పంపే సందేశాలు బీజేపీకి తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. సమస్య ఎంత తీవ్రగా ఉందో ఈ సందేశాలు సూచిస్తున్నాయి.

ఉద్యోగాల భర్తీ జరకపోవడం వలన, వివిధ శాఖల్లో సిబ్బంది కొరత వలన రాష్ట్రంలో పరిపాలన గాడి తప్పయింది. సిబ్బంది కొరత అనేక సమస్యలకు కారణమవుతున్నది. ప్రజలకు అందాల్సిన ప్రభుత్వ సేవలు అందడం లేదు. పథకాలు నిలిచిపోతున్నాయి, అవినీతి పెరిగిపోతున్నది.

కాబట్టి బీజేపీ చేస్తున్న ఈ కింది డిమాండ్లను పరిశీలించి, తక్షణమే అమలు చేసి అమరవీరుల ఆశయాలను నెరవేర్చి నిరుద్యోగులకు న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాం.

  •  టి ఎస్ పి ఎస్సి వార్షిక క్యాలెండర్ ను ప్రకటించాలి
  • డిపార్ట్మెంట్ వారీగా ఉన్న ఖాళీలు, వాటిలో భర్తీకి అనుమతి లభించినవి, నియామక ప్రకటన జారీ అయినవి, భర్తీ చేసినవి ఎన్ని అనే వివరాలను జోడిస్తూ టి ఎస్ పి ఎస్సి ఒక శ్వేత పత్రం విడుదల చేయాలి.
  •  తక్షణమే అన్ని ఖాళీలకు నోటిఫికేషన్లు విడుదల చేయాలి
  • వి ఆర్ ఓ, టి ఆర్ టి, ఎఫ్ బి ఓ, హాస్టల్ సంక్షేమ అధికారి, స్టాఫ్ నర్స్, పారామెడికల్ వంటి అనేక పోటీ పరీక్షల్లో సెలెక్ట్ అయిన అభ్యర్థులకు తక్షణమే పోస్టింగ్ ఇవ్వాలి.
  • కోర్టులో చిక్కుకున్న నోటిఫికేషన్ల కోసం న్యాయ నిష్ణాతులతో కమిటీని నినియమించి సత్వరంగా పరిష్కరించి పోస్టింగులు ఇవ్వాలి.
  • కోర్టు కేసుల్లో చిక్కుకున్న నోటిఫికేషన్ల స్థితిని ఎప్పటికప్పుడు టి ఎస్ పి ఎస్సి వెబ్సైటు లో అప్డేట్ చెయ్యాలి
  • పరీక్ష రుసుములను రద్దు చేయాలి
  • మెరిట్ లిస్టు ప్రకటించేటప్పుడు పరీక్షలో, ఇంటర్వ్యూలో వచ్చిన మార్కులను కూడా ప్రకటించాలి
  • రుసుముల ద్వారా అర్జించిన వందల కోట్ల రూపాయల సొమ్మును పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వాళ్ళ సంక్షేమం కోసం వెచ్చించాలి
  • నిరుద్యోగుల పై పెట్టిన కేసులను తక్షణమే ఎత్తివేయాలి