ప్ర‌జా ఉద్య‌మ‌కారుల‌పై అక్ర‌మ కేసుల‌ను ఎత్తివేయాలి

0 have signed. Let’s get to 100!


రచయితలు, మేధావులు, ఉద్యమకారుల అరెస్టులను,
వారిపై కుట్ర ఆరోపణలను, నిర్బంధాన్ని ఖండిస్తున్నాం

దేశంలో బ్రాహ్మణీయ హిందూ ఫాసిజం ప్రజలను, ప్రజాస్వామికవాదులను, రచయితలను వెంటాడుతోంది. ప్రజల పోరాట వారసత్వాన్ని తలపోసుకోవడం కూడా నేరంగా పరిగణిస్తోంది. ప్రజా ఆకాంక్షలను ఎత్తిపట్టడం టెర్రిరిజంగా భావిస్తోంది. సాహిత్య సాంస్కృతిక విప్లవాచరణను కుట్రగా వక్రీకరిస్తోంది. ముఖ్యంగా ఈ జనవరి నుంచి దేశవ్యాప్తంగా ప్రజాశక్తులపై దాడులు పెరిగిపోయాయి. ఢిల్లీ, ముంబై, నాగపూర్‌ పట్టణాల్లో ప్రజాసంఘాల నాయకుల ఇళ్ల మీద జూన్‌ 6వ తేదీన దాడులు చేసి అయిదుగురు ప్రముఖ సామాజిక, రాజకీయ కార్యకర్తలను అరెస్టు చేశారు. పూనే, ఢిల్లీ, ముంబై, నాగపూర్‌ పోలీసుల జాయింట్‌ ఆపరేషన్‌లో భాగంగా ఈ అరెస్టులు చేశారు. వీరిలో దళిత హక్కుల(రిపబ్లికన్‌ ప్యాంథర్స్‌) కార్యకర్త, 'విద్రోహి' పత్రిక సంపాదకుడు సుధీర్‌ ధావ్లే, న్యాయవాది, ఇండియన్‌ అసోసియేషన్‌ ఫర్‌ పీపుల్స్‌ లాయర్స్‌ ప్రధాన కార్యదర్శి సురేంద్ర గాడ్లింగ్‌, కమిటీ ఫర్‌ రిలీజ్‌ ఆఫ్‌ పొలిటికల్‌ ప్రిజనర్స్‌కు పబ్లిక్‌ రిలేషన్స్‌ సెక్రెటరీగా ఉన్న రోనా విల్సన్‌, విస్థాపనకు వ్యతిరేకంగా పోరాడుతున్న విస్థాపన్‌ విరోధి జన వికాస్‌ ఆందోళన్‌ సభ్యుడు మహేష్‌ రావత్‌, నాగపూర్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్‌, మహిళా హక్కుల కార్యకర్త షోమా సేన్‌ ఉన్నారు. ఏప్రిల్‌ నెలలో ఢిల్లీలోని రాజకీయ ఖైదీల విడుదల కమిటీ ప్రజా సంబంధాల కార్యదర్శి రోనా విల్సన్‌ ఇంటిపై దాడి చేసి ల్యాప్‌టాప్‌, ఫోన్‌, ఇతర పరికరాలు ఎత్తుకెళ్లారు. అట్లే నాగపూర్‌లో సుప్రసిద్ధ న్యాయవాది ఇండియన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ పీపుల్స్‌ లాయర్‌ (ఐఎపిఎల్‌) సెక్రెటరీ జనరల్‌ సురేంద్ర గాడ్లింగ్‌ ఇంటిపై దాడి చేసి ఆయన వద్దనున్న ఎలక్ట్రానిక్‌ సామగ్రినంతా ఎత్తుకెళ్లారు. వీరంతా సమాజానికి బాధ్యత పడిన ఆలోచనాపరులు. అట్టడుగు జనసమూహం గురించి మాట్లాడుతున్న వాళ్లు. ఆపరేషన్‌ గ్రీన్‌హంట్‌ మొదలయ్యాక ప్రభుత్వ దుర్మార్గాన్ని ప్రశ్నిస్తున్న మేధావులు.

200 సంవత్సరాల క్రితం పీష్వాలపాలనను అంతం చేసి అమరులైన దళిత, బడుగు వర్గాల యోధులను స్మరించుకోడానికి దళితులు, ఆదివాసులు, ముస్లిం మైనారిటీలు, శివాజీ వారసులు ఇంకా తదితర బడుగు వర్గాల ప్రజలు 'ఎల్గార్‌ పరిషత్‌' ఆధ్వర్యంలో 2017 డిసెంబర్‌ 31న 'నయీ పీష్వాయీ నహీ చలేగీ'అని వేలాదిమంది సభలో నినదించినందుకు వీరంతా నేరస్తులయ్యారు. బ్రాహ్మణీయవివక్ష వ్యతిరేక జ్యోతిబా ఫూలే సంప్రదాయాన్ని, డా. బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ కులనిర్మూలన పోరాటాన్ని భుజాలకెత్తుకున్నందుకు నేరస్తులయ్యారు. అక్కడితో రాజ్యం ఆగలేదు. మహారాష్ట్ర, పూణె సరిహద్దుల్లో నిర్మాణం అవుతున్న గోల్డెన్‌ కారిడార్‌ ప్రతిఘటనా పోరాటానికి మావోయిస్టులు పంపిన దళాలతో వీళ్లకు సంబంధాలు ఉన్నాయనే మరో ఆరోపణ కూడా చేశారు. వాస్తవానికి భీమా కోరేగావ్‌ ప్రదర్శనపై దాడి చేసిన ఆరెస్సెస్‌ కార్యకర్తలిద్దరిని ఎందుకు అరెస్టు చేయలేదనే నిరసన ముంబయి, పూణె నగరాల్లో వినిపించడంతో అసలు నిందితులను వదిలేసి దళిత, ఆదివాసీ ప్రజా పోరాటాలతో, విప్లవోద్యమ చైతన్యంతో పని చేస్తున్న వారిపై యుఎపిఎ కేసు పెట్టి అరెస్టు చేశారు. వీళ్లందరినీ మావోయిస్టు పార్టీ 'అర్బన్‌ కనెక్ట్‌' అనే పేరుతో పూణె కోర్టులో జూన్‌ 8న హాజరుపరిచి పోలీసు కస్టడీకి రెండు సార్లు తీసుకుని జూన్‌ 21వ తేదీన జెయిలుకు పంపారు. నాగ్‌పూర్‌లో పోలీసులు అరెస్టు చేయగానే రక్తపోటుకు గురైన సురేంద్ర గాడ్లింగ్‌ను పూణె ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చగా ఐసియులో యాంజియోగ్రామ్‌ చేయవలసి వచ్చింది. అయినా ఇవ్వాళ్టిదాకా ఆయన పోలీసు కస్టడీలోనే ఉన్నాడు.

పోలీసుల కుట్ర ఇక్కడితో ఆగలేదు. రోనా విల్సన్‌ ల్యాప్‌టాప్‌లో ప్రధానిని హత్య చేసేందుకు మావోయిస్టు పార్టీ కుట్రపథకంతో లేఖలు దొరికాయని తీవ్ర నేరారోపణలు చేశారు. ఇప్పటి దాకా మనకు తెలిసిన కుట్ర కేసులన్నిటిలోకంటే పరమ అసంబద్ధమైన కథనాలతో మోడీ, ఫడ్నవీస్‌ల రాజ్యం విప్లవ రచయితల సంఘం వ్యవస్థాపక సభ్యుడు వరవరరావును ఇందులో ఇరికించే ప్రయత్నం చేస్తోంది. చివరికి డా.అంబేద్కర్‌ మనుమలు ప్రకాశ్‌ అంబేద్కర్‌, ఆనంద్‌ తేల్‌తుంబ్డే, కబీర్‌ కళా మంచ్‌ హరీష్‌ పోద్దార్‌, ఢిల్లీ జెఎన్‌యు విద్యార్థి ఉమర్‌ ఖలీద్‌లతో పాటు జిగ్నేష్‌ మేవానీ మొదలుకొని ఎందరో దళిత ఉద్యమ నాయకులను, మేధావులను కూడా ఈ కుట్ర కథనంలో భాగం చేసి నిర్బంధం తీసుకరావడానికి ప్రయత్నిస్తోంది. ఇప్పటికే నాలుగు సంవత్సరాల నుంచి ఢిల్లీ ప్రొఫెసర్‌ జి.ఎన్‌. సాయిబాబా, అతని సహచరులు ఎ మిశ్రా (జెఎన్‌యు విద్యార్థి, సాంస్కృతిక కార్యకర్త), ప్రశాంత్‌ రాహీ(జర్నలిస్టు), ముగ్గురు ఆదివాసీ ఖైదీలు విజయ్‌ టిర్కీ, మహేష్‌, పాండులు ఏడాదికి పైగా ఉత్తరప్రదేశ్‌లో భీమ్‌ సేన నాయకుడు చంద్రశేఖర్‌ ఆజాద్‌ను జెయిల్లో నిర్బంధించారు.

రోహిత్‌ వేముల (ఆత్మ)హత్య కాలం నుంచి న్యాయం కోసం పోరాడుతున్న విద్యార్థి నాయకులు పృథ్వి రాజ్‌, చందన్‌ మిశ్రాలను విజయవాడ నుంచి మార్చ్‌ ఆఖరున కిడ్నాప్‌ చేశారు. సెంట్రల్‌ యునివర్సిటీ వైస్‌ చాన్సలర్‌ పొదిలి అప్పారావు హత్యాప్రయత్నం కేసులో యుఎపిఎ, ప్రజాభద్రతా చట్టం, పేలుడు పదార్థాల చట్టం, కుట్ర మొదలైన సెక్షన్‌ల కింద రాజమండ్రి జైలులో పెట్టారు. పృథ్విరాజ్‌ కృష్ణా జిల్లా విరసం సభ్యుడు. అతని కేసులో విచారణకు రావాలని కృష్ణాజిల్లా విరసం సభ్యులు అరసవెల్లి కృష్ణ, మేడక యుగంధర్‌, పెద్ది కృష్ణలను చింతూరు డిఎస్‌పి దగ్గరికి వచ్చి హాజరుకావలసిందిగా సమన్లు పంపారు. వీరితోపాటు ఇతర ప్రజాసంఘాల నాయకులు బండి దుర్గా ప్రసాద్‌ (అప్పటికే యుఎపిఎ, ప్రజాభద్రతా చట్టం, పేలుడు పదార్థాల చట్టం,కుట్ర మొదలైన నేరారోపణలపై డిఎస్‌యు నాయకులు బద్రి, రంజిత్‌, సుధీర్‌లతోపాటు ఖమ్మం జైల్లో ఉన్నాడు.), తెలంగాణ విద్యార్థి వేదికలో పనిచేసి ఇపుడు వరంగల్‌లో న్యాయవాదిగా ఉన్న అనిల్‌కు, ప్రగతిశీల కార్మిక సంఘం నాయకుడు కొండా రెడ్డితో సహా 15మందికి ఇలా సమన్లు పంపారు. వీరిని విచారణతోనే సరిపెడతారా, లేక పృథ్వి రాజ్‌, చందన్‌ మిశ్రా కేసులో భాగం చేస్తారా? తేలాల్సి ఉంది.

జనవరి నుంచి జూన్‌ దాకా ఈ దళిత-మావోయిస్టు సంబంధ నేరారోపణలు, అరెస్టులు, అరెస్టులకు సన్నాహాలు చేయడం రాజ్యం పన్నిన అతి పెద్ద కుట్ర. విప్లవ రచయితలకైనా, ఇతర దళిత, ప్రజాస్వామిక నాయకులకైనా తాము నమ్మిన భావజాలాన్ని నిర్భీతిగా ప్రకటించుకునే ఆత్మవిశ్వాసం ఉన్నది. పాదర్శకమైన ప్రజా జీవితంలో తమ రాజకీయ విశ్వాసాలను ఆచరిస్తున్న చరిత్ర ఉన్నది. కానీ అనేక కుట్రలతో, కూహకాలతో మనుగడ సాగిస్తున్న ప్రభుత్వం వీరి మీద కుట్ర, విధ్వంస చర్యలు, టెర్రిరిజం వంటి ఆరోపణలు చేస్తోంది. ఇవి అవాస్తవం. అప్రజాస్వామికం.

ర‌చ‌యిత‌లు, మేధావులు, హ‌క్కుల కార్య‌క‌ర్త‌ల‌పై అక్ర‌మకేసుల‌ను ఎత్తివేయాలి. త‌ప్పుడు ఆరోప‌ణ‌ల‌తో జైళ్ల‌లో నిర్బంధించిన ఉద్య‌మ‌కారుల‌ను విడుద‌ల చేయాలి.

 

- విప్ల‌వ ర‌చ‌యిత‌ల సంఘం