ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఏర్పాటు - మంచిర్యాల, తెలంగాణ

0 have signed. Let’s get to 1,000!


అయ్యా,

ఇటీవల జరిగిన కేంద్ర కేబినెట్ మీటింగ్ లో మన దేశంలో మొత్తం 75 మెడికల్ కాలేజీల మంజూరుకు ఆమోదం జరిగింది. కాబట్టి, మంచిర్యాల మరియు చుట్టూ ప్రక్క ప్రాంత ప్రజల తరపున వేడుకునేదేంటంటే ఈసారైనా ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీని ఇక్కడ ఏర్పాటు చేసేలా చూడగలరని మనవి.

            ఈ మెడికల్ కాలేజీ మంచిర్యాలలో ఏర్పాటు చేయుటకు గల కారణాలు క్రింద పేర్కొనబడినవి:

1.     మంచిర్యాలకి ఆనుకుని ఉన్న వివిధ జిల్లాల ప్రజలకి అందుబాటులో ఉంటుంది. ఉదాహరణకి కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాలు, జగిత్యాల జిల్లాలోని పలు ప్రాంతాలు, పెద్దపల్లి జిల్లాలోని పలు ప్రాంతాలు అలాగే మహారాష్ట్ర లోని పలు ప్రాంతాలు, ఒరిస్సా లోని పలు ప్రాంతాలు, ఛత్తీస్ ఘడ్ లోని పలు ప్రాంతాలు...ఇలా దాదాపుగా ౩౦ లక్షలకి పైగా ప్రజలు ఈ కాలేజీ సేవలు అందుకోవచ్చు.

2.     ఇంకో ముఖ్య విషయం ఏంటంటే మంచిర్యాలకి దాదాపుగా 150 కిలోమీటర్ల పరిధిలో ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీ కూడా లేదు. కాబట్టి మంచిర్యాలలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఏర్పాటు చాలా అవసరం.  

3.     మెడికల్ కాలేజీ ఏర్పాటుకై చేస్తున్న పోరాటం అంతా ఇంతా కాదు, అదొక ఆరని కార్చిచ్చు. గత 20 ఏళ్లుగా పోరాటం చేస్తూనే ఉన్నాము. కాబట్టి ఇప్పుడు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. పట్టువదలని విక్రమార్కుడిలాగా, ఉడుం పట్టులాగా ఉండాలి మన ఈ ప్రయత్నం.

4.     మంచిర్యాలలోనే ఎందుకంటే మంచిర్యాల మరియు చుట్టూ పక్కల ఉన్న "సింగరేణి కాలరీస్ కంపెనీ", "మంచిర్యాల సిమెంట్ కంపెనీ", "బోలెడు పైపుల కంపెనీలు, పత్తి మిల్లులు", "ఈనాడు పేపర్ మిల్లు", పవర్ ప్లాంట్, రామగుండము", "FCL కెమికల్ కంపెనీ, రామగుండము", "జైపూర్ పవర్ ప్లాంట్"....ఇలా ఎన్నో కంపెనీల వల్ల ఉద్యోగాల కోసం, జీవన భృతి కోసం ప్రజలు ఇక్కడకు వచ్చి స్థిరపడటంతో ఇక్కడి జనాభా పెరిగి ఇప్పుడున్న ప్రభుత్వ ఆసుపత్రి సేవలు సరిపోవడం లేదు.

5.     మంచిర్యాలలోనే ఎందుకంటే మంచిర్యాలకి అనువైన రోడ్డు మరియు రైలు రవాణా సౌకర్యాలు మెండుగా ఉన్నాయి అంటే మంచిర్యాలకి వివిధ ప్రాంతాలనుండి తేలికగా చేరుకునే సదుపాయం ఉంది.  ఉదాహరణకి తెలంగాణ లోని ముఖ్య ప్రాంతాలైన హైదరాబాద్, వరంగల్ నుండి, మహారాష్ట్ర ప్రాంతాలైన నాగ్ పూర్, నాందేడ్, భైంసా, షిర్డీ, ముంబై, చంద్రాపూర్, సిరొంచ, ఒరిస్సా రాష్ట్ర ప్రాంతాలైన జగదల్ పూర్, ఆంధ్రప్రదేశ్ ప్రాంతాలైన విజయవాడ, గుంటూరు మొదలగు ప్రాంతాల ప్రజలు తేలికగా ఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు. మంచిర్యాలలో దాదాపుగా అన్ని Super-Fast రైళ్లు ఆగుతాయి. అలాగే మంచిర్యాలకు హైదరాబాద్, చెన్నై, విజయవాడ, ఢిల్లీ మొదలగు ముఖ్య మరియు సుదూర ప్రాంతాల నుండి కూడా సులువుగా చేరుకోవచ్చు.

6.     చివరగా మంచిర్యాల చుట్టు పక్క ప్రాంత పరిధిలోని అధిక శాతం ప్రజల జీవనోపాధి వ్యవసాయం, పశుపోషణ, కూలి మరియు ఇతరత్రా చిన్న తరహా కుటీర పరిశ్రమలు. వీరందరికి ప్రయివేట్ వైద్యం అనేది అందని ద్రాక్ష. కాబట్టి మంచిర్యాలలో ఏర్పాటు చేసే ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఇక్కడి ప్రజానీకానికి ఒక వరం. అలాగే ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీ సేవలను మనందరం ఉచితంగా, ఉన్నతంగా అధునాతన పద్దతిలో అందుకోవచ్చు.

 

కాబట్టి ఇన్ని వసతులు, అనుకూల పరిస్థితులు ఉండి లక్షల మందికి ఉపయోగపడే ప్రభుత్వ మెడికల్ కాలేజీని మన మంచిర్యాలకి తీసుకొచ్చేందుకు నడుం బిగిద్దాం.  

 

ఒకవేళ మన పోరాటంలో పస లేకపొతే అందివచ్చిన అవకాశాన్ని మనం మరియు మన భావితరాలు చేజేతులారా కోల్పోయిన వాళ్ళం అవుతాం. కాబట్టి రండి, చేయి చేయి కలుపు....చివరికి మనదే గెలుపు....

(ప్రియమైన మిత్రులు, సోదర & సోదరిమణులు: మేము చేసే ఈ అభ్యర్థనకు "మద్దతు" పలుకుతూ, మీకు తెలిసిన వారందరికీ చేరవేస్తూ...చివరకు మన గౌరవనీయ ముఖ్యమంత్రి గారి దృష్టికి వెళ్లేలా చేయగలరని మనవి)